ఎప్పటి లానే ఆరోజు మధ్యాహ్నం కూడా భోజనానికి మా ఆఫీసు కింది కాఫెటేరియా (హొటల్లాంటిది) కి వెళ్ళాను. మామూలు నీలం రంగు కుర్చీలు, అద్దంలా మెరిసే బల్లలు, రోజా పువ్వు పరిమళంతో శ్వాసించే కిటికీలు, అప్పుడప్పుడు అన్నం మధ్యలో కలుపుకోవడానికి కాస్త కమ్మగా అమ్మాయిల నవ్వులు, అన్నిటికంటే చెత్తగా భోజనాలు . మాకందరికీ అందుబాటులో ఉన్న ఒకే ఒక్క అమృతభాండం ఆ కాఫెటేరియా. ఆ అలుసుతో ఆ వంటవాడు వాడి మూడ్ కి తగినట్లు వంటలు చేస్తాడు. వాళ్ళావిడితో గొడవైనప్పుడు ప్రత్యక్షంగా ఆ వంటల మీద పరోక్షంగా మా మీద కక్ష తీర్చుకుంటాడు. ఒక్కోసారి ఏదో ఆనందంలో సగం ఉడికిన అన్నాన్నే మాకు గిఫ్ట్ కింద సప్లయ్ చేస్తాడు. మా అందరి ఓపిక ఏదో ఒక రోజు బద్దలై, అతని మీద విరుచికుపడి పనిలోంచి తప్పించేస్తామేమో.? అప్పుడు ఆ ఆనందంతో నేను ఇలానే ఇంకో పోస్ట్ కూడా చేస్తానేమో..?!
ఆరోజు కూడా ఆ రుచి పచి లేని ఆ చప్పిడి అన్నం తింటూనే ఎదురుగా ఉన్న ఎవరో కొత్త అమ్మాయి వంక చూసాను. ఒక్కటి కూర్చొని చాల శ్రద్దగా, ఎంతో ఒద్దికగా, ఒక్కో ముద్దా అన్నం కలుపుకొని తింటూ ఉంది. అందరు చెప్పేలాగా అమ్మాయిలు అందంగా నవ్వడమో, చూడడమో, నడవడమో మాత్రమే కాదు, కొందరు భోజనం ఎంతో అందంగా చేస్తారు. సున్నితంగా, తినే కంచానికి కూడా దెబ్బతగులుతుందేమో అన్నట్లు వేళ్ళ మధ్యలోకి అన్నం తీసుకొని తింటుంటే – ఆ చిన్నిపెదవులు కదిపే విధం, పైకి కిందికి బుగ్గలు కదులుతుంటే చూడడానికి నాకెందుకో ముచ్చటేసింది. ఈ నడివయసు కళ్ళకి అమ్మాయి ఏంచేసిన అందంగా ఎలా కనపడుతుంది ఈ కుర్రవెధవలకి అని ఎవరు ఏమనుకున్నా, కళ్ళ ముందు మెదులుతున్న దివ్యత్వాన్ని దర్శించగలిగే ఉన్నతమైన హృదయం మాకే సొంతమని గర్వంగా చెప్పగలను నేను. నెమ్మదిగా ఆ చేతివేళ్ళని, అరచేతిని చూసేసరికి నా ప్రాణం ఉల్లిక్కి పడింది. ఆ అమ్మాయి చేతివేళ్ళు అచ్చం తన చేతివేళ్ళలానే ఉన్నాయ్. నిజం.
ఆ చిన్న అరచేతులు, కాస్త లావాటి ,మందమైన చర్మంగల వేళ్ళు. నా బుగ్గల్ని తాకి, నా కళ్ళను మూసి, నా జుట్టును తనకిష్టం వచినట్లు చెదరగోట్టిన వేళ్ళు. ఇంతకు మునుపు ఇద్దరం ఒకే కంచంలో తినేప్పుడు నా పెదవినంటే తియ్యటి వేళ్ళు నాకు తెలుసు. అలానే ఈ అమ్మాయి వేళ్ళు . నా పిచ్చో ఏమో తెలియదు కాని, అమాంతం ఇద్దరి చేతులు ఒకేలా. అసలే తినలేని బోజనాన్ని ఇంక ఈ అదురుతో తినలేక పక్కకి తోసేసి,ఆ అమ్మాయి చేతుల వంకే చూస్తున్నాను. ఎడమచేతికో వాచ్, కుడిచేతికి మూడు గాజులు, ఆ చివరి చిటికినవేలుకి ఉంగరం. అన్ని అవే.. అలానే ఉన్నాయ్. నా గుండె వణుకుతోంది. తనేనేమో అని ఈ అమ్మాయి మొహం వంక మళ్లీ చూసాను. కాదు. ఎవరో.! ఎందుకీ వింత ఆలోచనలు నాకు .. ?
మనుషులు పోలిన మనుషుల్లా, చేతులు పోలిన చేతులు కూడా ఉంటాయా..? లేకపోతే నా భ్రమా..? మా మధ్య ప్రేమ చీలిన తరువాత, తనని మరిచిపోవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించాను.. ప్రయత్నిస్తున్నాను. కాని ఏవీ తన నుండి నా మనసును కొంచెం కూడా మళ్ళించలేక పోతున్నాయి. తన వెలుగుని బలవంతంగా నేను మూస్తే, అది నన్ను వెయ్యి ద్వారాలుగా బద్దలు చేసి బయటపడుతోంది. ఎటూ తేలక తన ప్రేమ జ్యోతి ముందు సగం కళ్ళను మూసి, ఈ సగం గుడ్డి మనసుతో వేగుతున్నాను.
నేను నమ్మకూడదని కళ్ళు మూసుకొని గట్టిగా నాకు నేను చెప్పుకున్నాను. కాని నా లోపల బలమైన స్వార్థం ఆ చేతివేళ్ళని చూడమని నా కళ్ళని తెరిపిస్తోంది. ఒక వేల తనేన ? నేను కనిపెట్టగలనా లేదా అన్న సందేహంతో మొత్తం మారిపోయి.. ఆ చిన్ని చేతులతో మాత్రమె నా ముందు కుర్చోందా, లేక తన మాయలో నన్ను నేను పూర్తిగా మనిషిగా కోల్పోయానా ? మరి ఏంటిది. ఎవరికో అమ్మాయికి తనలాంటి చేతి వేళ్ళు.! ఆ కళ్ళు, బుగ్గలు ఏవి కనీసం పోలికైన లేవే. చివరికి ఈ స్థితిలో పడ్డాను నేను. టక్కున నా వంక ఆ అమ్మాయి చూసింది,విచిత్రంగా!. ఇక చూడరా?!. ఆ భోజనం వైపు చూస్తున్నట్లు అనిపిస్తుంది చూసే ఎవరికైనా. కంచం నుండి పెదవులకి, పెదవుల నుండి కంచానికి నాట్యం చేసే అందమైన చేతులు. అమృతం పండే అరచేతులు. ఆ వేళ్ళు కాస్త కదిలితే గాలి హుషారుగా ఈల వేస్తుంది. అలాంటి అద్బుతమైన చేతులు. నేనలా ఆ అయోమయం లో ఉండగానే ఆ అమ్మాయి భోంచేసి వెళ్ళిపోతోంది. ఏం చెప్పగలను.. ఏం చెయ్యగలను.ఈ చేతులు నీవేనా అని అడగాలా ? ఇంకాసేపు నా ముందు కూర్చోకుడదా అని బ్రతిమాలాలా ? ఎంత వెర్రిలో ఉన్నానో నువ్వే ఆలోచించుకో. ఏంచెయ్యలేక ఏదో వింతస్థితిలో కాసేపు అక్కడ కూర్చుండి పోయాను. అదే ఆ అమ్మాయిని ఆఖరు చూడడం. ఇంతవరకు మళ్ళీ రాలేదు.
—నగేష్ బాబు—