అవి నాకు రోజుకి 24 గంటలు సరిపోని మధురమైన రోజులు .!
తను మౌనంగా,నెమ్మదిగా నా యవ్వనపు ప్రేమ కధకు అక్షరాలని అందిస్తున్నరోజులు .!
ఉదయమో, ఆ సోగ కనుల చూపుకోసం తపించే ఆత్రమో నన్నునిదురలేపేవి.
తనని, తన కింద పెదవి మాత్రమే వంపు తిరిగే సగం నవ్వుని తలుచుకోగానే నా ప్రాణం ఒణికేది.
ఎంత కుదురుగా ఉన్న తన అందమైన మాయ నన్ను ఓ చోట నిలువనిచ్చేది కాదు. ఏదో లోకానికి అర్థం కాని గొప్ప అనుభూతి నాకు కలిగేది.
ఖాళి కాఫీ కప్పుతో తో మాట్లాడేవాణ్ణి, నా 25cc హెర్కులస్ సైకిల్ తో నవ్వేవాన్ని, కాలేజీకి వెళ్ళే దారిలో తెలియని వాళ్ళని కూడా పలకరించే వాణ్ణి.
మా కాలేజీ దారంతా ఎప్పుడూ పచ్చగా నవ్వుతుండేది.
ఆకులతో.. రాతిరి వెన్నల బరువుతో రాలిపోయిన పువ్వులతో.. అందంగా ఉంటుంది.
తను చిన్న లూనా లో వచ్చేది. ఇప్పటికి ఏదైనా లూనని ఎక్కడైనా చుస్తే గుండె వేగంగా కొట్టుకుంటుంది.
ఏ దారి వైపు తను ఎదురవుతుందో అని, అన్నిదారుల వైపు నా కన్నులు చూపులని పరచేవి.
ప్రకృతి లో ఏదో లోటుని సరిదిద్దడానికి పుట్టిందేమో అనిపించేలా ఉంటుంది తను..!
కానీ నేను శతకోటి లింగాల్లో ఓ బోడి లింగాన్ని..!
మన వైపు తను ఎందుకు చూస్తుంది..?!
ఐన నా తిమ్మిరి ఆగేది కాదు. తన నీడ వెనకాలే నన్ను తోసేది.
తను నన్ను చూడాలని క్లాసులకి ఆలస్యంగా వెళ్ళెవాణ్ణి. ఎవరా ఆలస్యంగా వస్తోంది అని తనతో పాటు అందరు నన్ను చూసేవాళ్ళు.
నేను తనని మాత్రమే చూసేవాణ్ణి. అలా ఆ ఒక్క నిముషమే నా రోజునంతటిని వెలిగించేది.
మా JKC (జవహర్ నాలేడ్జే సెంటర్) ట్రైనింగ్ లో సెమినార్లు ఇవ్వడం కూడా ఓ విభాగం లో ఉండేది.
అందరు వాళ్ళ ఇష్టమైన విషయం మీద ఇవ్వోచ్చు. నేను మాత్రం తన కు ఇష్టమైన టాపిక్ మీద ఇవ్వాలనుకున్న.
నానా తంటాలు పడి ఐన్ స్టీన్ ప్రతిపాదించిన “E=MC 2” సమీకరణాన్ని గురించి ఇవ్వాలనుకున్నా .
ఎలాగైనా ఈ సెమినార్ ని చించేసి, దంచేసి, పొడిచేసి…వయోలేన్స్ ఎక్కువయ్యిందని అనిపించినా సరే.. ఏదో ఒకటి చేసి తన ఇంప్రేషన్ కొట్టేయాలని
ఓ ప్లాన్ వేసుకున్న.!
ఐన్ స్టీన్ ఎం చెప్పాడో నాకు సరిగ్గా ఎక్కలేదు కానీ.. నేను స్టేజిపైన ఉండగా తను నా వైపు చూసే సన్నివేసం ఊహించి, ఉల్లిక్కిపడి మల్లి సరిగ్గా చదివేవాన్ని.
తనే నా పేపర్ దిద్దే పద్దతి ఉంటె నా పరీక్షలని నేను ఇంకా బాగా రాసుండేవాణ్ణేమో.?!!
ఆ రోజు అద్దం ముందు నిల్చొని ప్రాక్టీసు చేసి, ఉన్న బట్టల్లోనే మంచివి ఇస్త్రి చేసి వేసుకొని కొత్త పెళ్ళికొడుకులా వెళ్ళా కాలేజీకి .
మొదటి పేరు నాదే కావడంతో స్టేజిపైకి వెళ్ళాను. అందరి చూపు నా వైపే. గుండెల్లో దడ పెరిగింది. సెమినార్ పేపర్లు చేతితో పాటు వనుకుతున్నై.
తన కోసం వెతికాను.. అదుగో.. రెండవ బెంచ్ లో కూర్చొని నా వైపు.. అంటే.. అదే బోర్డు వైపు చూస్తోంది.
ఆ రోజు చెవికి పక్కగా, తన బుగ్గల రంగుకి దగ్గరగా ఉండే రోజా పువ్వుని పెట్టుకొంది.
ఏ రంగు బట్టలేసిన అందంగా మెరిసే మేని ఛాయ తనది. తన కళ్ళు సముద్రం మధ్యలోని ప్రశాంతత లా ఉంటాయి .
తనని ఒక్క సారి చూడగానే నా తడబాటు అంత గాలికి ఎగిరిపోయింది.
నెమ్మదిగా మొదలుపెట్టాను. తరువాత, నేనే ఆ సమీకరణాన్ని ప్రతిపాదించాను అన్నంత ఉత్సాహంగా, తనని ఎలాగైనా ఇంప్రెస్స్ చెయ్యాలని ఆత్రంగా చెప్తున్నా.
మధ్యలో తన వైపు చూసాను ….
శ్రద్దగా.. ఆ చిన్ని గడ్డం కింద చేతిని ఆనించి, చెంప పైకి జారుతున్న జుట్టుని వెన్నక్కి తీసుకుంటూ.. చేతి వేళ్ళని అప్పుడప్పుడు పెదవులకి తగిలిస్తూ..
ముఖ్యమైన విషయాల్ని రాసుకుంటూ.. ముచ్చటగా కనిపిస్తోంది.!
10 నిముషాలలో నా సెమినార్ ఐపోయింది. అందరి చప్పట్లు చెబుతున్నాయి ఎంత బాగా చెప్పానో. నాకు మాత్రం తన చిరు నవ్వు చెప్పింది.
ఆనందంతో సరిగ్గా నిలబడలేక పొయ్యాను. తన వైపు చూసి చిన్నగా నవ్వి.. కిందికి వచ్చేసాను.
కాలేజీ అయిపోయిన తరువాత, కాంపస్ లో మా స్నేహితులందరూ కలిసి చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటున్నాం.
నన్ను పిలిచినట్లుగా అనిపించి వెనక్కి చూసాను.
కాస్త దూరంగా తను.! దగ్గరగా నా గుండె చప్పుడు. !
నాకు వంట్లో రక్తం ఆగిపోయింది.
అన్ని స్లోమోషన్ లోకి వచ్చేసాయి. చెట్టు కొమ్మలు.. పక్కన ఫుట్ బాల్ ఆడుకుంటున్న అందరు.. వేగంగా వెళ్తున్న బైక్.. అన్ని నెమ్మదిగా కదుల్తున్నాయి.
తన దగ్గరికి వెళ్ళాను. “ఇవాళ సెమినార్ చాల బాగా ఇచ్హావ్.. రేపు కలుద్దాం.. బయ్” అంటూ.. వెళ్ళిపోయింది.
నా చేతులే రెక్కలిపోయినట్లుగా నేను మా కాంపస్ అంతా ఎగిరాను.
ఇలా నా మనసుకి ఆకాశాన్ని కలిపేసే తన పరిచయాన్ని అందించిన ఐన్ స్టీన్ సమికరినాన్ని, నా మొదటి సెమినార్ ని ఎప్పటికి మరిచిపోలేను.
ఆ తరువాత ఎన్ని సెమినార్లు ఇచ్చినా అవి.. నా ఉద్యోగధర్మం కోసమో.. మరింక దేని కోసమో ఇవ్వాల్సి వచ్చేవి అంతే.
ఇప్పటికి ఆ సెమినార్ పేపర్లని అలాగే దాచుకొని ఆ అద్బుతమైన నిముషాల్ని గుర్తుచేసుకుంటాను.
—నగేష్ బాబు—

oh! chinna size bapu cinema choosinatlundhi…………athreya matalu krishna sashtri varnana kalinatllu vundi cheppina saili…..
Good work!
గోవర్ధన్ కి ధన్యవాదాలు
మామ ….ఆ jkc క్లాసులో నేను ఉన్నాను …..
…
ఆ అమ్మాయి ఎవరో నాకు తెలుసు మామ….:)
చప్పమంటావా ఈ బ్లాగులో ……..
లూనా అమ్మాయి , హెర్కులాస్ అబ్బాయి ……….ప్రేమ కథ……….